Friday, September 24, 2010

One more example for the bad state of Technical Education in A.P

 Article from Andhra Jyothy dated 23-09-2010. It is in Telugu.

300 ఎంసీఏ కాలేజీలు మూత?
కొత్త, గ్రామీణ కాలేజీలపై విద్యార్థుల విముఖత

నిర్వహణపై చేతులెత్తేస్తున్న యాజమాన్యాలు
రెండో విడత కౌన్సెలింగ్ నుంచి తొలగించండి
రాష్ట్ర ఉన్నత విద్యా మండలికి అభ్యర్థనలు
ఇది సరికాదంటున్న అధికారులు
విద్యార్థుల సర్దుబాటు బాధ్యత కళాశాలలకే
తొలి విడత కౌన్సెలింగ్‌లో
74 కాలేజీల్లో జీరో అడ్మిషన్లు
277 కాలేజీల్లో పది కంటే తక్కువే
87 కాలేజీల్లో 20 కూడా నిండలేదు

హైదరాబాద్, సెప్టెంబర్ 23 : 'పిండి కొద్దీ రొట్టె'... పెద్దలు చెప్పిన ఈ సామెత రాష్ట్రంలోని ఎంసీఏ కాలేజీలకూ వర్తిస్తుంది. మంచి ఫ్యాకల్టీ, మౌలిక సదుపాయాలు ఉన్న కాలేజీలనే విద్యార్థుల తల్లిదండ్రులు ఎంపిక చేసుకుంటున్నారు. తమ పిల్లలను వాటిలో చేరుస్తున్నారు. అవి లేకపోతే ఇంటి పక్కనే కాలేజీ ఉన్నా వాటి మొహం కూడా చూడడం లేదు. ఐటీ బూమ్ ఉన్నప్పుడు అందరూ కంప్యూటర్‌వైపే ఎగ బడ్డారు. ఇబ్బడి ముబ్బడిగా ఎంసీఏ కాలేజీలు వెలిశాయి.

అప్పట్లో సీటు దొరికితే చాలన్నట్లు.. ప్రమాణాలు లేకపోయినా.. ఫ్యాకల్టీ లేకపోయినా తమ పిల్లలను వాటిలో చేర్చేశారు. కుర్చీలు, బల్లలు లేని కాలేజీలు కూడా కోర్సులను నిర్వహించేశాయి. కానీ.. ఐటీ బూమ్ బద్దలు కావడంతో ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఐటీ రంగంలో ఉద్యోగావకాశాలు సన్నగిల్లడంతో ఆషామాషీగా అనుమతి పొందిన కాలేజీల్లో ఎంసీఏ చదివినా ప్రయోజనం లేదని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు అభిప్రాయపడుతున్నారు.

అందుకే.. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 300 ఎంసీఏ కాలేజీలు మూత దిశగా పయనిస్తున్నాయి. కొత్త, మారుమూల ప్రాంతాల్లోని కాలేజీల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 675 ఎంసీఏ (మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్) కాలేజీలు ఉన్నాయి. మొదటి దశ కౌన్సెలింగ్ పూర్తయిన తర్వాత పాత, గుడ్‌విల్ ఉన్న కాలేజీల్లో మాత్రమే పూర్తిస్థాయిలో అడ్మిషన్లు పూర్తయ్యాయి. గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లోని కాలేజీలకు మొదటి దశ అడ్మిషన్ల కౌన్సెలింగ్‌లో విద్యార్థుల నుంచి కనీస స్పందన రాలేదు.

ఈనెల ఒకటో తేదీన జరిగిన సీట్ల కేటాయింపు సందర్భంగా 74 ఎంసీఏ కాలేజీల మొహాన్ని ఒక్క విద్యార్థి కూడా చూడలేదు. వాటిలో జీరో అడ్మిషన్లు నమోదయ్యాయి. ఇక, 277 కాలేజీల్లో పదికంటే తక్కువ అడ్మిషన్లు.. 87 కాలేజీల్లో 20 కంటే తక్కువ అడ్మిషన్లు కావడం విశేషం. ఈ నేపథ్యంలోనే 2010-11 విద్యా సంవత్సరంలో రాష్ట్రవ్యాప్తంగా 300కుపైగా ఎంసీఏ కాలేజీలు మూత పడేందుకు సిద్ధంగా ఉన్నాయి. వాస్తవానికి, సీటు అలాట్ అయిన అభ్యర్థులు గురువారంలోగా ఆయా కాలేజీల్లో రిపోర్టు చేయాల్సి ఉంది.

కానీ ఆయా కాలేజీల్లో అడ్మిషన్ల పరిస్థితిని గమనించిన అభ్యర్థుల్లో సింహ భాగం చేరడానికి ముందుకు రాలేదు. దీంతో కాలేజీ యాజమాన్యాల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఇంత తక్కువమంది విద్యార్థులతో కాలేజీలను ఎలా నిర్వహించాలో అర్ధంకాక ఆందోళన చెందుతున్నారు. ఇక, ఎంసీఏ అడ్మిషన్ల రెండో దశ కౌన్సెలింగ్ ఈనెల 24వ తేదీ నుంచి 27 వరకు జరుగుతుందని రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఇప్పటికే ప్రకటించింది.

ఈ దశలోనూ తమ కాలేజీల్లో అడ్మిషన్లు కావని అంచనా వేసిన యాజమాన్యాలు తమ కాలేజీని రెండో దశ కౌన్సెలింగ్ జాబితా నుంచి తొలగించాలని మండలిని కోరుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 15 కాలేజీల నుంచి ఈ మేరకు మండలికి అభ్యర్థనలు అందాయి. ప్రస్తుత విద్యా సంవత్సరంలో తాము ఎంసీఏ కోర్సును నిర్వహించలేమని వారు చేతులెత్తేస్తున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, తిరుపతి, కడప, వరంగల్, నెల్లూరు తదితర జిల్లాల నుంచి ఈ వినతులు వచ్చాయి.

కనీసం 25 అడ్మిషన్లు కూడా లేకుండా కాలేజీని ఎలా నిర్వహించగలమని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని కాలేజీల యాజమాన్యాలు కూడా ఇదే మాదిరిగా లేఖలు రాస్తున్నట్లు సమాచారం. తాజా సమాచారం ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా 300 ఎంసీఏ కాలేజీల యాజమాన్యాలు ఈ ఏడాది కోర్సులు నిర్వహించరాదని ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వీటిలో కొత్త, గ్రామీణ ప్రాంత కాలేజీలే అధికంగా ఉన్నాయి.

అయితే.. ఎక్కువ అడ్మిషన్లు ఉన్నప్పుడు కాలేజీని నిర్వహించి.. తక్కువ ఉన్నప్పుడు చేతులెత్తేయడం సరైన పద్ధతి కాదని రాష్ట్ర ఉన్నత విద్యామండలి అభిప్రాయపడుతోంది. కౌన్సెలింగ్ జాబితాలో ఓసారి కాలేజీని చేర్చిన తర్వాత.. ఒక్క అడ్మిషన్ జరిగినా కాలేజీని నిర్వహించాల్సిందేనని మండలి అధికారులు తేల్చి చెబుతున్నారు.

ఒకవేళ నిర్వహించలేని పరిస్థితుల్లో.. తమ కాలేజీల్లో అడ్మిషన్లు తీసుకున్న విద్యార్థులను ఇతర కాలేజీల్లో సర్దుబాటు చేయాల్సిన బాధ్యత కూడా ఆయా కాలేజీల యాజమాన్యాలపైనే ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. కాగా, ప్రమాణాలు లేకుండా కాలేజీలను నిర్వహించేవారికి ఇలాంటి పరిస్థితి ఎదురు కావడం మంచి పరిణామమేనని పలువురు విద్యావేత్తలు అభిప్రాయపడ్డారు.








  

No comments:

Post a Comment